‘జగన్ చర్యల వల్ల పార్టీకి నష్టమే. అయితే దానిపై అధిష్ఠానం చర్యలు తీసుకుంటోంది. ఆయనకు మద్దతునిస్తోన్న ఎమ్మెల్యేలపై చర్యల విషయంలో ఆలోచిస్తున్నాం’
- పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్
‘జగన్‌కు మద్దతునిస్తోన్న ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకపోతే పార్టీ మరింత నష్టపోతుంది. వారిపై చర్యలకు అధిష్ఠానం భయపడుతోందన్న సంకేతాలు వెళతాయి’
- ఇటీవల ఆజాద్‌ను కలసిన సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల వినతి
‘జగన్ వర్గం వారిపై తక్షణం చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది. ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నారో అర్ధం కావడం లేదు’
- రాజ్యసభ సభ్యుడు వి.హన్మంతరావు
‘జగన్‌కు మద్దతునిస్తూ, ఇంకా పార్టీలో కొనసాగుతున్న ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలి. మా పార్టీకి మొనగాడు కావాలి’
- కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరశివారెడ్డి
(సూర్య ప్రధాన ప్రతినిధి)జగన్‌కు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలు ఎంపీలపై వేటు వేయాలంటే ఏఐసీసీ కార్యదర్శి నుంచి పీసీసీ ప్రధాన కార్యదర్శి వరకూ ఎవరు ఎంత మొత్తుకు న్నా ఢిల్లీలో చలనం కనిపించడం లేదు. ఈ విష యంలో నత్తలు కూడా నవ్వుకుంటున్నాయన్నది కార్యకర్తల ఆవేదన. నత్తల కన్నా ఘోరంగా తమ పార్టీ పనిచేస్తోందన్నది వారి ఆందోళన. ఈ ధిక్కార పర్వంపై పీసీసీ అధ్యక్షుడు పట్టించుకోరు. ముఖ్య మంత్రి తనకు సంబంధం లేని వ్యవహారంగా భావిస్తారు.రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిది చుట్టపు చూపు వ్యవహారం. మరి పట్టించుకునేదెవరు? కాంగ్రెస్ శ్రేణులకు ఇదో మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎవరు ఎన్ని ఫిర్యాదులు చేసినా ఒకటే సమాధానం. సరైన సమయంలో సరైన నిర్ణయం!
ఇదే జగన్ వర్గంపై చర్యలు తీసుకోమని కోరే వారికి వినిపించే రొటీన్ జవాబు. అయితే... ఆ సరైన సమయం ఎప్పుడు? 2014 ఎన్ని కల ముందా? ప్రభుత్వం పూర్తిగా అప్రతిష్ఠ పాలయిన తర్వా తనా? పార్టీలో అరాచకవాదం పూర్తి స్థాయిలో ముదిరిన తర్వా తనా? అన్నదే అందరి సూటి ప్రశ్న. జగన్‌కు మద్దతునిచ్చే ఎమ్మె ల్యేలు ఆయన ప్రభుత్వానికి-పార్టీకి వ్యతిరేకంగా నిర్వహించే దీక్షలు, సభలపై నుంచి సొంత పార్టీని తిడుతున్నా వారిపై చర్యలు తీసుకునే దమ్ము తమ పార్టీకి లేకుండా పోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తోన్న ఎంపి మేకపాటి, సబ్బం హరి సర్కారును బంగాళాఖాతంలో విసిరేస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వా నికి రోజులు దగ్గరపడ్డాయని బహిరంగ సవాళ్లు విసురుతున్నా తమ నాయకత్వంలో చలనం కనిపించకపోవడంతో.. తమ పార్టీ కి వారిపై చర్యలు తీసుకునే దమ్ము లేదన్న సంకేతాలు ప్రజల్లోకి స్పష్టంగా వెళ్లాయంటున్నారు. స్వయంగా ఎంపీ మేకపాటి వైఎ స్సార్ కాంగ్రెస్ ఆఫీసులో కూర్చుని మీడియా సమావేశం పెట్టినా చర్యలు తీసుకోలేని అసమర్థ స్థితిలో ఉన్నామన్న ఆవేదన పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.
కేవలం ప్రభుత్వాన్ని కాపాడుకునే లక్ష్యం తప్ప, పార్టీ భవిష్యత్తు గురించి నాయకత్వం ఆలోచించడం లేదని నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విషయంలో నాయకత్వంపై ఒత్తిడి తెచ్చి, జగన్ వర్గ ఎమ్మెల్యేలపై ఉక్కుపాదం మోపడంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అసమర్థంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కడప ఉప ఎన్నికలో జగన్ భారీ మెజారిటీకి కారణమయిన ఎస్పీ-కలెక్టర్‌పై ఇంతవరకూ చర్యలు తీసుకోవ డంలో కిరణ్ ధైర్యం చేయలేకపోయారని గుర్తు చేస్తున్నారు. డీ ఎల్, వీరశివారెడ్డి ఫిర్యాదు చేసినా, ఇటీవలి జరిపిన ఐఏఎస్ - ఐపీఎస్ బదిలీలలో వారిద్దరి పేర్లు లేకపోవడం బట్టి తమ సీఎం ఎంత ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నారో స్పష్టమవుతోందని ఎద్దేవా చేస్తున్నారు. ‘కిరణ్ స్థానంలో వైఎస్, చంద్రబాబులాంటి వాళ్లుంటే ఈపాటికి కలెక్టర్-ఎస్పీ బదిలీ అయిపోయి ఉండేవారు. అందుకే వీరశివారెడ్డి మా పార్టీకి ఓ మొనగాడు కావాలని వ్యాఖ్యా నించారు. నిజంగానే పార్టీకి ఈ పరిస్థితిలో ఓ మొనగాడు కావా లి. దమ్ములేని వారితో పార్టీనడవద’ని ఓ ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
ఎమ్మెల్యేలను దారిలోకి తీసుకురావడంలో విఫలమైన ముఖ్య మంత్రి, కనీసం వారిపై చర్యలు తీసుకోవడంలో కూడా విఫలమ వుతే ఇక రాష్ట్రంలో పరిపాలన-పార్టీ ఏమవుతుందని ఓ రాజ్యసభ సభ్యుడు ప్రశ్నించారు. కేవలం ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకే చూస్తున్నారు తప్ప, 2014 తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ భవితవ్యం గురించి నాయకత్వంతో సహా ఎవరూ ఆలోచించడం లేదన్న ఆవేదన వ్యక్తమవుతోంది. తాత్కాలికంగా జగన్ వర్గ ఎమ్మెల్యేలను బుజ్జగించడమో, కేసుల పేరిట బెదిరించడమో చేస్తున్నారు తప్ప, వారు 2014 ఎన్నికల ముందు జగన్ వైపు స్థానిక నేతలతో కలసి వెళితే అక్కడ పార్టీకి దిక్కెవరని ప్రశ్నిస్తున్నారు.
జగన్‌కు మద్దతునిస్తున్న చాలామంది ఎమ్మెల్యేలు స్థానిక కారణాలు, అనర్హత భయం వంటి కారణాలతో ఇప్పటికి మౌనంగా ఉన్నప్పటికీ, నియోజకవర్గాల్లో తమ సొంత పలుకు బడి పెంచుకుంటున్నారు.
తమ మౌనం ద్వారా కాంగ్రెస్ పార్టీలోనే తమకు ప్రత్యామ్నాయం లేకుండా చూసుకుంటున్నారు. అంటే తాము భవిష్యత్తులో జగన్ పార్టీలో చేరితే కాంగ్రెస్‌లో ఎవరూ మిగలకుండా ఉండే వ్యూహంతో ఇప్పటినుంచే పనిచేస్తున్నారు. అయితే వీరంతా 2014 ఎన్నికల సమయంలో జగన్ పార్టీలో దూకితే కాంగ్రెస్‌కు జెండా పట్టే కార్యకర్త కూడా దొరకని ప్రమాదకర పరిస్థితి కనిపిస్తోందని సీనియర్లు అధిష్ఠా నాన్ని హెచ్చరిస్తున్నారు.
జగన్ వర్గ ఎమ్మెల్యేలను ప్రస్తుతం బుజ్జగించే బదులు, వారిపై చర్యలు తీసుకుంటే 2014 ఎన్నికల నాటికి నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయ నేతలను తయారుచేసుకోవచ్చంటున్నారు. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసినా, సభలో ఉన్న సభ్యుల సంఖ్య ప్రకారం ప్రభుత్వం పడిపోయే అవకాశాలేమీ లేవని స్పష్టం చేస్తున్నారు. లేకపోతే 2014 ఎన్నికల్లో పార్టీకి అభ్యర్ధులు కూడా దొరకని దయనీయ పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు.
అధిష్ఠానం ఈ విషయంలో ఇంకా నాన్చుడు వైఖరి అవలం బిస్తే... ఎన్నికల నాటికి జగన్‌ను పార్టీలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోందని, అందుకే ఆయన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడం లేదన్న సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందంటున్నారు. ‘ఎప్పటికయినా కాంగ్రెస్-జగన్ కలసిపోతారన్న ప్రతిపక్షాల ఆరోపణలను నిజం చేయాలనుకుంటే జగన్ వర్గ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవలసిన అవసరం ఏ మాత్రం లేదు. అప్పటి వర కూ పార్టీ ఇలాగే భ్రష్ఠుపట్టినా ఫర్వాలేదనుకుంటే మేమేమీ చేయలేమ’ని సీమకు చెందిన ఓ ఎమ్మెల్యే వెటకారంగా వ్యాఖ్యా నించారు.
Coutesy:Surya
No comments:
Post a Comment