Watch Videos of Prince Mahesh Business Man Records, Collections ,Trailers, Interviews, Audio Release....

Friday, January 27, 2012

ఎవరు సునీల్ రెడ్డి వైయస్ జగన్‌కు ఎలా దగ్గరయ్యాడు


ఎమ్మార్ కేసులో అరెస్టయి సునీల్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఎలా దగ్గరయ్యాడనేది ఆసక్తికరంగా మారింది. విజయసాయి రెడ్డి వైయస్ జగన్‌కు ఒక పార్శ్వమైతే, సునీల్ రెడ్డి మరో పార్శ్వమని చెబుతారు. జగన్ సంస్థలో చిరు ఉద్యోగిగా చేరిన సునీల్ రెడ్డి తన చురుకుదనం ప్రదర్శించి, జగన్ ఆంతరంగికుడిగా మారాడు. సునీల్ రెడ్డిది కడప జిల్లా వీరపునాయునిపల్లె మండలం అనిమెల గ్రామం. అక్కడి నర్రెడ్డి సంగిరెడ్డి రెండో కుమారుడే ఈ సునీల్ రెడ్డి. మూడు దశాబ్దాల కిందటే ఆయన కుటుంబం పులివెందులకు వలస వెళ్లింది. రాజశేఖర రెడ్డి బావ సీవీ సుబ్బారెడ్డికి సంగిరెడ్డి సమీప బంధువు. దానికితోడు, వృత్తిరీత్యా ఆయన జియాలజిస్టు. దీంతో, వైఎస్ కుటుంబంతో అనుబంధం ఏర్పడింది. గనుల వ్యాపారంలో నష్టపోయిన సంగిరెడ్డిని రాజశేఖర రెడ్డి ఆదుకున్నారు. ఆ తర్వాత, సునీల్ రెడ్డిని జగన్ కంపెనీలో ఓ చిరుద్యోగంలో చేర్పించారు.

సునీల్‌లోని చురుకుదనాన్ని గమనించిన జగన్ ఆయనను తన ఆంతరంగికుడిగా నియమించుకున్నారు. వ్యక్తిగత సహాయకుని హోదా కల్పించారు. ఇక, అప్పటి నుంచి జగన్ ఆర్థిక, వ్యక్తిగత వ్యవహారాలన్నీ సునీల్ రెడ్డే చక్కబెట్టేవాడని చెబుతారు. జగన్ విద్యుత్తు రంగంలోకి అడుగు పెట్టిన మొదటి కంపెనీ సరస్వతి పవర్. దీని నుంచి మొదలుకుని ఆ తర్వాత జగన్ సృష్టించిన చాలా కంపెనీల్లో జగన్ సతీమణి భారతీ రెడ్డితోపాటు సునీల్ కూడా ఒక డైరెక్టర్. ఆమెకు సునీల్ సన్నిహిత బంధువు కూడా. ఎటువంటి హోదా లేకపోయినా జగన్ శిబిరంలో అన్నీ ఆయనే. జగతి పబ్లికేషన్స్‌లోకి నిధులు మళ్లించారని చెబుతున్న కంపెనీల్లో - కీలాన్ టెక్నాలజీస్‌కు విజయసాయిరెడ్డి ఆయన భార్య ప్రమోటర్లు అయితే, మిగిలిన ఐదు కంపెనీలూ - జడ్ఎం ఇన్ఫోటెక్, సిగ్మా ఆక్సిజన్, సాయిసూర్య వేర్‌హౌజింగ్, ఎక్సెల్ ప్రోసాఫ్ట్, రెవెరాలు జగన్ వ్యాపార సామ్రాజ్యానికి కేంద్రంగా చెప్పే సండూర్ పవర్‌కు ఇన్వెస్టర్ల హోదాలో నిధులు సమకూర్చాయి. ఈ ఐదు కంపెనీల్లోనూ జగన్ భార్య భారతీ రెడ్డితోపాటు సునీల్ రెడ్డి.

ఈ నేపథ్యంలోనే సునీల్ రెడ్డి పేరు బయటకు వచ్చింది. ఎమ్మార్ కేసులో కోనేరు ప్రసాద్ నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డికి డబ్బులు అందజేసింది సునీల్ రెడ్డేనని సీబీఐ వర్గాలు భావిస్తున్నాయి. ఈ కేసులో అరెస్టైన కోనేరు ప్రసాద్ ఇచ్చిన వాంగ్మూలంలో సునీల్ రెడ్డి ప్రస్తావన ఉందని, ఆ తర్వాతే ఆయనపై సీబీఐ దృష్టి సారించిందని తెలుస్తోంది. అన్ని అంశాలనూ ద్రువీకరించుకున్న తర్వాతే సునీల్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసినట్లు సమాచారం. మరో విశేషం ఏమిటంటే.. జగన్ పేరు చెబితే ఒంటికాలిపై లేచే కమలాపురం ఎమ్మెల్యే వీరశివారెడ్డి సోదరుని అల్లుడే ఈ సునీల్ రెడ్డి. కడప జిల్లా నక్కలదిన్నెకు చెందిన వీరశివారెడ్డి సోదరుడి కుమార్తెను సునీల్ రెడ్డి వివాహమాడారు.

No comments:

Post a Comment