Watch Videos of Prince Mahesh Business Man Records, Collections ,Trailers, Interviews, Audio Release....

Saturday, January 28, 2012

మంత్రివర్గ మార్పులపై పట్టు వదలని ముఖ్యమంత్రి


మంత్రివర్గ మార్పులపై ఇటీవల ఢిల్లీ వెళ్ళినపుడు హైకమాండ్ ఆమోదం తెలపక పోయినప్పటికీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పట్టువదలని విక్రమార్కునిలా మరోసారి ప్రయత్నించనున్నారు. ఫిబ్రవరి 4న ప్రధాని మన్మోహన్ సింగ్ నగర పర్యటన ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్ళనున్నారు. 5న ఢిల్లీ వెళ్ళే అవకాశం ఉంది. కేబినెట్ మార్పులపై హైకమాండ్‌తో చర్చించి ఆమోదం లభిస్తే, ఆరు లేదా ఏడో తేదీన కేబినెట్ మార్పులు చేపట్టాలన్న ఉద్దేశంతో ఉన్నారు. ముఖ్యమంత్రి కోరినప్పటికీ బడ్జెట్ సమావేశాల ముందు మంత్రివర్గ మార్పులకు హైకమాండ్ అనుమతి ఇస్తుందా? అన్న అనుమానాన్ని కాంగ్రెస్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే మంత్రివర్గంలో తెలంగాణ ప్రాంతానికి సరైన ప్రాతినిధ్యం లేదన్న విమర్శలు రావడంతో త్వరలోనే దాన్ని పరిష్కరిస్తామన్న హామీ మేరకు హైకమాండ్ అనుమతిచ్చినా ఆశ్చర్యం లేదని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. మంత్రివర్గ మార్పులు ఉండేది లేనిదీ ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనను బట్టి ఆధారపపడి ఉంటుందని భావిస్తున్నారు. ఫిబ్రవరి 13నుంచి శాసనసభ, శాసనమండలి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మంత్రివర్గ మార్పులతోపాటు ఖాళీగా ఉన్న వివిధ పదవుల నియామకంపైనా ముఖ్యమంత్రి దృష్టిపెట్టారు.
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ప్రస్తుతం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వ్యవహారంలో తలమునకలై ఉన్నారు. సోనియా అప్పాయింట్‌మెంట్ దొరికితే ఐదు లేదా ఆరో తేదీల్లో ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళనున్నారు. మంత్రివర్గ మార్పులకు సంబంధించి ముఖ్యమంత్రి ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారు. ముఖ్యమంత్రి ప్రతిపాదనల ప్రకారం నలుగురు మంత్రుల్ని బయటికి పంపించి కొత్తగా ఐదారుగురుని మంత్రివర్గంలోకి తీసుకోనున్నారు. మంత్రివర్గం నుంచి ఉద్వాసన చెప్పాలనుకుంటున్న వారిలో కోస్తా ప్రాంతానికి చెందిన ఇద్దరు, రాయలసీమకు చెందిన ఒకరు ఉన్నారు. మంత్రివర్గంలో తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల మధ్య సమతుల్యత పాటించే కారణంతో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో మంత్రి పదవికి రాజీనామా చేయించేలా హైకమాండ్‌ను కోరనున్నారు. కాగా కొత్తగా కేబినెట్‌లోకి తీసుకోవాలనుకుంటున్న వారిలో తెలంగాణ ప్రాంతానికి చెందిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని, మల్లు భట్టి విక్రమార్కను, రాయలసీమ ప్రాంతానికి చెందిన మాజీ మంత్రి జెసి దివాకర్‌రెడ్డిని, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పాముల రాజేశ్వరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఉన్నారు. పిసిసి అధ్యక్షుడు బొత్స మంత్రి పదవికి రాజీనామా చేసినట్లయితే విజయనగరం జిల్లా బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ వెంకటరంగారావును మంత్రివర్గంలోకి తీసుకుంటారు.
శాఖల మార్పు
ఇలాఉండగా, మంత్రివర్గ మార్పులకు హైకమాండ్ అనుమతి ఇవ్వకపోయినా బడ్జెట్ సమావేశాలకు ముందు కొంతమంది మంత్రుల శాఖలను మార్చాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. కనీసం ఆరుగురు మంత్రుల శాఖలు మారే అవకాశం ఉందని తెలిసింది. గుంటూరు జిల్లాకు చెందిన మంత్రి మోపిదేవి వెంకటరమణ ప్రస్తుతం నిర్వహిస్తున్న ఎక్సైజ్ శాఖను తొలగించి వేరే శాఖను ఆయనకు ఇవ్వాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఉన్నట్టు తెలిసింది. ఎక్సైజ్ శాఖను ఆదే జిల్లాకు చెందిన మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌కు అప్పగించి ఆయన ప్రస్తుతం నిర్వహిస్తున్న గ్రామీణాభివృద్ధి శాఖను మరొకరికి అప్పగించాలని అనుకుంటున్నారు.
చీఫ్ విప్‌గా గండ్ర
విప్‌లుగా వంగా గీత, జగ్గారెడ్డి, పద్మరాజు?
ఇలాఉండగా ప్రస్తుతం ఖాళీగా ఉన్న ప్రభుత్వ చీఫ్ విప్ పదవిని వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్టు తెలిసింది. గండ్ర మంత్రి పదవిని ఆశిస్తుండగా ప్రస్తుత సమీకరణల్లో సాధ్యం కాకపోవడం వల్ల ఆయనకు చీఫ్ విప్ పదవిని ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. అదేవిధంగా విప్‌లు శాసనసభలో ఎమ్మెల్యే వంగా గీత, ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి (జగ్గారెడ్డి)లను, ఎమ్మెల్సీల కోటానుంచి పద్మరాజును నియమించాలని నిర్ణయించినట్టు తెలిసింది.
మూడు విడతలుగా కార్పొరేషన్ చైర్మన్ పదవులు
ఖాళీగా ఉన్న వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లతోపాటు పాలక మండళ్ళను నియమించేందుకు కూడా ముఖ్యమంత్రి కసరత్తు చేపట్టారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో చర్చించిన తర్వాత పేర్లను ఖరారు చేయనున్నారు. కార్పొరేషన్ చైర్మన్ పదవుల్ని మూడు విడతలుగా నియమించాలన్న అభిప్రాయంతో ముఖ్యమంత్రి ఉన్నట్లు తెలిసింది.

No comments:

Post a Comment