FILE
కెమెరా: వెట్రి, కృష్ణస్వామి, సంగీతం: థమన్, మాటలు, పాటలు: శశాంక్ వెన్నెలకంటి, కథ, కథనం, డాన్స్, దర్శకత్వం: రాఘవ లారెన్స్, బెల్లంకొండ గణేష్‌బాబు సమర్పణలో శ్రీసాయిగణేష్ ప్రొడక్షన్స్ ప్రై. లిమిటెడ్ పతాకంపై బెల్లంకొండ సురేష్ నిర్మించారు.
పాయింట్: సమాజంలో చులకనగా చూడబడే ఓ వర్గానికి స్ఫూర్తినిచ్చే చిత్రం.
లారెన్స్ చిత్రాలంటే ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. డాన్స్, ఫైట్స్‌తో పాటు కథలో కూడా కొత్తదనంతో గతంలో కొన్ని చిత్రాలు వచ్చాయి. తాజాగా సమాజంలో ఏహ్యభావంతో అటు కుటుంబంలోనూ ఇటు బయటా చూడబడేవారున్నారు. అంతా దేవుని సృష్టే అయినప్పుడు అర్థనారీశ్వరునిగా పుట్టించడం కూడా ఆయనపనేగా. దాన్ని ఎందుకు చీదరించుకుంటారు. పరువు తక్కువ అని తల్లిదండ్రులు కూడా ఎందుకు భావిస్తారు. అలా భావించిన ఓ వ్యక్తి కథే కాంచన. దీనికి 'ముని-2' అని పెట్టారు. మునిలో లారెన్స్ ఓ ఇంటిలోకి అద్దెకి వచ్చినప్పుడు అక్కడ దెయ్యం ఉందనే తెలుసుకుని, దాని కోరికను ఎలా తీర్చాడు అన్నది కథ. కాంచనలో కథ కొత్తగా ఉంటుంది. ట్విస్ట్ ఏమంటే.. కొనసాగింపుగా ముని-3 కూడా చేయడానికి ప్లాన్ చేయడం.
కథ:
తల్లిచాటు బిడ్డగా పెరిగిన రాఘవ (లారెన్స్)కు దెయ్యాలంటే చచ్చేంత భయం. తన అన్న శ్రీమాన్, వదిన, పిల్లలు అతన్ని ఆటపట్టిస్తుంటాడు. కానీ తన స్నేహితులతో క్రికెట్ ఆడడం, అన్యాయం జరిగితే పోరాటాలు చేయడం చాలా ఈజీగా చేస్తుంటాడు. ఓసారి క్రికెట్ ఆడడానికి స్థలం దొరక్క ఆ పక్కనే ఉన్న ఎకరం పొలంలో ఆడుకునేందుకు చదును చేస్తారు. ఆడే సమయానికి మేఘాలతో కూడిన గాలి రావడంతో ఇంటికి వచ్చేస్తారు. వచ్చేటప్పుడు పాతిన వికెట్లను తీసుకొస్తాడు. కానీ వికెట్‌లకు రక్తం అంటుకున్న విషయాన్ని గమనించకుండా... అది ఏదో రంగనుకుని ఇంటిలోనే రాఘవ కడిగేస్తాడు.
కానీ ఆ స్థలంలో ఉన్న దెయ్యం ఈ రకంగా రాఘవ ఇంట్లో ప్రవేశిస్తుంది. ఈ విషయం ఇంట్లో ఎవరికీ తెలీదు. ఆ తర్వాత రాఘవ ప్రవర్తన పిచ్చిపిచ్చిగా మారడం, ఆడదానిలా ప్రవర్తించడంతో అనుమానంతో భూత ప్రేతాత్మల్ని పారద్రోలే దర్గా దగ్గరకు తీసుకెళతారు కుటుంబ సభ్యులు. అక్కడ అసలు విషయం తెలుస్తుంది. రాఘవను కాంచన అనే దెయ్యం పట్టి పీడిస్తుంది. తనను అన్యాయంగా చంపిన వారిని వదిలిపెట్టనని చెబుతుంది. చివరికి దర్గాలోని బాబా కాంచనను సీసాలో బంధిస్తాడు.
రాఘవ మామూలు మనిషిగా మారతాడు. ఆ తర్వాత రాఘవలోని మానవత్వం మేలుకొంటుంది. కాంచన కథ విన్నాక.. తను ఏదో ఒకటి చేయాలని నిర్ణయానికి వస్తాడు. అసలు కాంచన కథేంటి? రాఘవ ఏంచేశాడు? అన్నది సినిమా.
లారెన్స్ నటనా విశ్వరూపం ఇందులో కన్పిస్తుంది. అమాయకుడిగా, చిన్నపిల్లవాడిలా, రౌద్రరూరపునిగా రసాలను పండించాడు. అపరితుడిలోని పార్శ్వాలు కథాపరంగా లారెన్స్ ఇందులో పోషించాడు. నాట్యం, ఫైట్స్‌లో కొత్త కోణాన్ని ఆవిష్కరించాడు. దర్శకుడిగా ఉంటూ ఇన్ని పాత్రలు పోషించడం విశేషం. రాఘవ మరదలుగా లక్ష్మీరాయ్ నటించింది. నటనకు స్కోప్ లేకపోయినా గ్లామరస్‌గా కన్పించింది. తల్లి పాత్రలో కోవైసరళ పండించింది. కాకపోతే ఆమె పాత్ర తెలుగువారికి ఓవర్‌గా అనిపించినా తమిళులకు అలవాటే. మిగిలిన పాత్రలన్నీ బాగానే నటించాయి.
వెట్రి, కృష్ణస్వామి కెమెరా బాగుంది. తమన్ సంగీతం ప్రత్యేకం. ఈ చిత్రానికి బ్యాక్‌గ్రౌండ్ ఎఫెక్ట్‌లు, గగుర్పాటు గొలిపే సౌండ్ వ్యవస్థ కథకు సరిపోయింది. దెయ్యం ఆవహించినప్పుడు పాత్ర స్వరూపాలుమారే నేపథ్యంలోనూ ఆ తర్వాత కొన్ని సన్నివేశాల్లోనూ గ్రాఫిక్స్ హైలైట్‌గా నిలుస్తాయి. పాటలపరంగా వికలాంగులకు స్ఫూర్తిదాయకంగా ఉండేలా 'నుంచో నుంచో స్వంత కాళ్ళపై నుంచే..' అంటూ సాగే పాట ఆలోచింపచేస్తుంది. 'కాంచన.. కాంచన..' అని సాగే పాటలో హిజ్రాల గెటప్‌లో లారెన్స్ బాగా చేశాడు.
అసలు కథకు మలుపైన కాంచన పాత్రధారి శరత్‌కుమార్. హిజ్రా గెటప్ వేయడం విశేషమైతే. దాన్ని పండించి మెప్పించడం మరో విశేషం. సెకండాఫ్‌లో కథంతా ఆయనపైనే సాగుతుంది. ప్రేక్షకుడు ఆయన కన్పించినప్పటి నుంచీ కుర్చీలోంచి కదలడు. కథను ఆయన భుజాలపై వేసుకుని మోశాడు. సెంటిమెంట్, ఎమోషన్స్ అన్నీ పండించాడు. జీన్స్‌లో ఏర్పడ్డ లోపంతో పుట్టిన కొడుకునే తల్లిదండ్రులు తరిమేస్తే సమాజం మాత్రం ఏం చేస్తుంది. ఆ బాధ పడిన వ్యక్తి పడే బాధ వర్ణనాతీతం. అందరి మాదిరిగానే వారికి కొన్ని ఆశయాలు ఉంటాయి. వాటిని గౌరవించాలి.
అలాంటి వారిని ప్రోత్సహిస్తే సమాజం గర్వించే ఎలా ఎదుగుతారు అన్న పాయింట్‌తో కూడిన సందేశాన్నిస్తూ.. లారెన్స్ ఎంచుకున్న కథ బాగుంది. కైమాక్స్‌లో సీక్వెల్ 3 అంటూ ఇచ్చిన ట్విస్ట్ తర్వాత ఎలా ఉంటుందనే ఇంట్రన్ట్‌ను క్రియేట్ చేశాడు. సెన్సార్ సభ్యులే ఎ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన హార్రర్ చిత్రానికి ఒక చక్కటి సందేశాన్ని ఇచ్చినందుకు గాను యు/ఎ ఇవ్వడం విశేషం. 210 ప్రింట్లతో శుక్రవారం ఈ చిత్రం విడుదలవుతుంది.
No comments:
Post a Comment