WD
నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి పనిగట్టుకుని సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులకిచ్చిన స్థలాలను ఉటంకిస్తూ చర్చకు తెరలేపారు. దర్శకుడు కె.రాఘవేంద్రరావుకు స్టూడియోకోసం స్థలాలిస్తే దాన్ని కమర్షియల్‌గా మార్చేసి రకరకాల కట్టడాలు నిర్మించారని ఆరోపించారు.
అన్నపూర్ణా స్టూడియోస్‌కు 22 ఎకరాలు, ప్రసాద్ స్టూడియోస్ కేటాయించిన పదెకరాలు, ఆనంద్ సినీ సర్వీస్‌కు ఐదెకరాలు పద్మాలయాకు తొమ్మిదన్నర ఎకరాలను అప్పట్లో ఇచ్చారనీ, వాటి విలువ ఇప్పడు హీనపక్షంగా చూసినా సుమారు 700 కోట్ల రూపాయల పైమాటేనని టి. నేతలు ఏకంగా గులాంనబీ ఆజాద్ వద్ద చెప్పారు.
చిత్ర పరిశ్రమలో మౌలిక సదుపాయాల పెట్టుబడి కేవలం 93 కోట్లేనని, కానీ వారికి కేటాయించిన భూముల ధరలు మాత్రం కోట్లకు పడగలెత్తాయని విశ్లేషించారు. తెలంగాణా ప్రాంత భూములను కారుచౌక ధరలకే కొట్టేసిన సీమాంధ్రులు ఇక్కడ పెట్టుబడులు పెట్టామంటూ లబలబమంటున్నారని మండిపడ్డారు.
నిజానికి 1980లో ఈ భూములను తెలంగాణా ప్రాంతానికే చెందిన ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి పిలిచి మరీ ఇచ్చినవే. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చిత్ర పరిశ్రమను హైదరాబాద్ తీసుకు రావడానికి చెన్నైలో ఉన్న ప్రముఖ తెలుగు సినీనటులు, ఇతర ముఖ్యులను ఒప్పించారు. స్వయానా ముఖ్యమంత్రే అభ్యర్థిస్తుంటే కాదనలేని ఇండస్ట్రీ ప్రముఖులు నష్టాలకోర్చి హైదరాబాద్ తరలివచ్చారు.
మర్రి చెన్నారెడ్డికి స్నేహితుడు కూడా అయిన అక్కినేని ఎన్నో కష్టనష్టాలను ఓర్చుకుని అన్నపూర్ణా స్డూడియోను నిర్మించారు. నిజానికి ఆయన అక్కడ స్టూడియోను నిర్మించే రోజున అక్కడి భూమి విలువ కంటే ఆయన దానిపై స్టూడియోకోసం పెట్టిన ఖర్చు ఎన్నో రెట్లు ఎక్కువన్నది నిజం. అలా పట్టుబట్టి ఆయన స్టూడియోను నిర్మించడం ద్వారా ఎందరికో ఉపాధిని కల్పించారు.
ఏరు దాటాక బోడి మల్లయ్య అనే సామెత మాదిరిగా అప్పట్లో తెలుగు ఇండస్ట్రీ తెలుగు రాజధానిలో ఉండాలని నాటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి కలలు కంటే, నేటి నాయకులు వాటి విలువలను లెక్కగడుతూ చేసిన కృషిని చిన్నచూపు చూస్తున్నారు. ఒకవైపు సీమాంధ్రుల జోలికి వెళ్లమని చెపుతూనే తక్కువకే భూములను కాజేశారని అంటున్నారు.
అంటే... తెలంగాణా ప్రాంతం వారు సీమాంధ్రలో ఏవైనా కంపెనీలు స్థాపిస్తే, వారు కూడా దోచుకున్నారని అర్థమా..? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. టి.నేతల మాటలతో అటూ కాదు.. ఇటూ కాదు వచ్చిన చోటికే వెళితో బెటర్ అని టాలీవుడ్‌లో కొంతమంది సినీ ప్రముఖులు చర్చించుకుంటున్నట్లు టాలీవుడ్ న్యూస్.
No comments:
Post a Comment