Pages

Tuesday, July 19, 2011

రెండుకాళ్లూ లేని ఎవరెస్టు విజేత

అతనికి రెండు కాళ్లూ లేవు. ఓ ప్రమాదంలో గాయపడిన అతనికి శస్త్రచికిత్స ద్వారా కాళ్లు తొలగించాల్సి వచ్చింది. కాని అతను బాధ పడుతూ ఇంట్లో కూర్చోలేదు. వికలాంగుడైన తనపై సానుభూతి చూపాల్సిందిగా ఎవ్వరినీ కోరలేదు. రెండు కాళ్లూ లేకపోతేనేం విశ్వ విజేత అయ్యాడు. ప్రపంచాన్ని అబ్బురపడేలా చేశాడు. అతనే ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన హిమపర్వత శిఖరం ఎవరెస్టును అధిరోహించిన తొలి వికలాంగ విజేత, న్యూజిలాండ్‌కు చెందిన మార్క్‌ ఇంగ్లిస్‌. ఆదివారం ఇక్కడ నిర్వహించిన 10వ గిరిమిత్ర సమ్మేళనంలో పాల్గొన్నారు. ఆయన ప్రసంగం యువతకు స్ఫూర్తిని, ఉత్సాహాన్ని కలిగించింది. ఆయన మాటల్లో అసాధారణ ధైర్యం కనిపించింది. రెండు కాళ్లు కోల్పోయిన బాధ మార్క్‌లో ఇప్పటికీ లేదనేం దుకు ఆయన యువతతో మాట్లాడిన తీరే నిదర్శనం. కొండ ఎక్కే క్రమంలో కాలు జారి పడితే కోలుకోవడానికి ఆరు వారాల సమయం పడుతుందని, అదే తనకైతే కేవలం ఆరు గంటల సమయం సరిపోతుందని సమ్మేళనంలో యువతను ఉద్దేశించి మార్క్‌ అన్నాడు. రెండు కాళ్లూ లేనందు వల్ల కలిగే అదనపు ప్రయోజనం ఇదేనని చిరునవ్వులు చిందించే మార్క్‌లో యువతకు ఒక స్ఫూర్తి ప్రదాత కనిపించాడు. సొంతంగా కృత్రిమ కాళ్లను సమకూర్చుకోలేని వారి కోసమని 'లింబ్స్‌ ఫర్‌ ఆల్‌' పేరుతో స్వచ్ఛంద సంస్థను నడుపుతున్న మార్క్‌లో తన బాటలో మరొక విజేత వెలుగులోకి రావాలనే తాపత్రయాన్ని చూడవచ్చు.
మార్క్‌ నిలబడే ప్రసంగించాడు. కొద్ది సేపు వేదిక మీద కలియ తిరిగాడు. ప్రసంగం ముగించి వీడ్కోలు తీసుకునే సందర్భంలో అక్కడ హాజరైన వారంతా లేచి నిలబడి మార్క్‌ ధీరత్వానికి కరతాళ ధ్వనులతో అభినందనలు తెలిపారు. అందరు ఔత్సాహికుల మాదిరిగానే ఎవరెస్టు అధిరోహణకు సిద్ధపడిన మార్క్‌ సుమారు 40 రోజుల తరువాత 2006 మేలో ఎవరెస్టు విజేతగా నిలిచాడు. తద్వారా రెండు కాళ్లూ లేని తొలి ఎవరెస్టు విజేతగా రికార్డు సృష్టించాడు. వికలాంగులు సాధారణంగా నడకకు ఉపయోగించే ఊతకర్రల ఆసరాతో మార్క్‌ ఎవరెస్టు పర్వతారోహణ చేయడం అరుదైన ఘనత. 23 సంవత్సరాల వయసులో 1982లో న్యూజిలాండ్‌లోని కుక్‌ పర్వతారోహణకు వెళ్లినప్పుడు మంచు కారణంగా ఉత్పన్నమయ్యే ఎముకలు కొరికే చలి మార్క్‌కు ప్రధాన శత్రువుగా నిలిచింది. దాదాపు 13 రోజుల పాటు హోటల్‌ ఐస్‌ కేవ్‌గా వ్యవహరించే మంచు గుహలో చిక్కుకుపోవడం వల్ల 70 కిలోల బరువుండే తను 39 కిలోలకు తగ్గిపోయాడు. ఈ క్రమంలో గాయాలు ఏర్పడటంతో మార్క్‌ రెండు కాళ్లను శస్త్రచికిత్స చేసి తొలగించాల్సి వచ్చింది. ఈ తరువాతే ఎవరెస్టు శిఖరారోహణ చేశాడు. 

No comments:

Post a Comment